తెల్లోడి మాయ
అరిటాకు విస్తర్లో నేను తింటుంటే
తాటాకు గుడిసెల్లో నేను ఉంటూంటే
పేదవాడినంటూ నన్ను హేళి చేసాడు
ప్లాస్టిక్కు కాంక్రీటుతో నా నేల పూడ్చాడు
నా గాలి నా నీరు విషం చేసాడు
ఇపుడు ఏవో బయోడిగ్రేడబులు మెట్రియల్సట వాడమంటాడు
అర్ధమవ్వదు నాబోటి సిన్నోడికిదంతా
తెల్లోడి మాయరా ఇది తెల్లోడి మాయ
కష్టమొచ్చినా దుఃఖమొచ్చినా మొక్కే నా తల్లిని చూసి
ఇష్టదైవమై నా ఇంట వెలసిన మూర్తిని చూసి
రాయికి పూజ చేసే వెర్రోడివన్నాడు
దేవుడు లేదు దైయ్యం లేదు సైన్సు చాలన్నాడు
పూటకో శోకం రోజుకో రోగం ఉన్న మాబోటి బతుకుల్లో
మరి సైన్సు తీర్చని బాధల మోర వినేదెవరు
అర్ధమవ్వదు నాబోటి సిన్నోడికిదంతా
తెల్లోడి మాయరా ఇది తెల్లోడి మాయ
నా పల్లె పధ్ధతులు నా ఊరి పండగలు
నా సంస్కృతిని నా సంబరాలను చూసి
నాగరికత లేని ఆటవికుడివన్నాడు
పట్నం వచ్చి ప్యాంటుషర్టేసి ఆఫీసుకెళ్ళమన్నాడు
చెట్టు కింద నుంచి పీకిన పిలక మొక్కలా నేను
బిక్కుబిక్కుమంటూ పండగరోజున ఒక్కడినే కూర్చుంటే
ఫేసుబుక్కులోకెళ్ళి ఫ్రెండులు చేసుకోమన్నాడు
అర్ధమవ్వదు నాబోటి సిన్నోడికిదంతా
తెల్లోడి మాయరా ఇది తెల్లోడి మాయ
ఎంతోమంది నాలాంటి నల్లోళ్ళనందరిని
వేల ఏండ్లు వాళ్ళుండిన ఇండ్లలోనుంచి
తన్ని తరిమేసి వాడి దొరతనం చాటాడు
మీరు మనుషులే కాదంటూ ఈసడించుకున్నాడు
ఇపుడు ఆ నల్లోళ్ళ బొమ్మల్ని మ్యూజియమ్ములో పెట్టి
డబ్బిచ్చి మరీ చూసి అబ్బురపోతాడు
అర్ధమవ్వదు నాబోటి సిన్నోడికిదంతా
తెల్లోడి మాయరా ఇది తెల్లోడి మాయ
మైథిలీ